కేసీఆర్ మదిలో ఏముంది…?!

187
KCR

రాష్ట్రంలో లాక్ డౌన్ పొడగింపు,కేంద్రం ఇచ్చిన సడలింపులపై తెలంగాణ సర్కార్ మంగళవారం(మే 5) తేల్చేయనుంది. కేంద్రం నిర్ణయం వెలువడి నాలుగైదు రోజులు అయినప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఆచీ తూచీ ముందడుగు వేస్తోంది. కేంద్రం విధించిన మరో రెండు వారాల లాక్ డౌన్‌కే పరిమితమవడమా. లేక రాష్ట్రంలో మరింత కాలం లాక్ డౌన్ విధించడమా అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు,మూడు రోజులుగా సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు. ఆది,సోమవారాల్లో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో జరిపిన సమీక్షా సమావేశాల్లో కేసీఆర్ పలు అంశాలపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.లాక్ డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు విధించగా.తెలంగాణ ప్రభుత్వం మే 7వ తేదీ వరకు విధించింది. ఇటీవల కేంద్రం మూడో దశ లాక్ డౌన్‌ను మే 17 వరకు ప్రకటించింది. రాష్ట్రంలో దీన్ని అమలుచేస్తూనే మరింత కాలం లాక్ డౌన్‌ను పొడించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కేంద్రం విధించిన గడువు కంటే మరికొద్దిరోజులు తెలంగాణలో లాక్ డౌన్ తప్పదు అంటున్నారు.

జోన్లవారీగా ఇచ్చిన సడలింపులను ఇప్పటికే ఆయా రాష్ట్రాలు అమలుచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మద్యం అమ్మకాలు సోమవారం నుంచే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. దీనిపై ప్రజా ప్రతినిధులతో పాటు క్షేత్ర స్థాయిలో ఆయా రంగాలకు చెందినవారి నుంచి అభిప్రాయాలను సేకరించారు. ఎక్కువమంది మద్యం షాపులను తెరవద్దని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. అయితే రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరుల్లో మద్యం కూడా ఒకటి కావడంతో ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆరెంజ్,గ్రీన్ జోన్లలో సడలింపులపై వైద్య నిపుణులు ఉన్నతాధికారులతో కేసీఆర్ చర్చించారు. ప్రజాభిప్రాయాన్ని కూడా లెక్కలోకి తీసుకుని. సడలింపులకే మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక పదో తరగతి సహా వివిధ పోటీ పరీక్షల అంశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. నేడు ప్రగతి భవన్‌లో జరగబోయే మంత్రి మండలి సమావేశంలో వీటన్నింటిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here