

పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల క్రితమే సొంత నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాణ సంస్థలో కొన్ని సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. కొన్నాళ్ల క్రితం పవన్ నిర్మాణంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయబోతున్నాడు అని అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని వార్తలు వినిపించాయి. అదుగో కథ ఇదిగో దర్శకుడు అన్నట్లుగా పుకార్లు వినిపించినా కాని పవన్ నిర్మాణంలో చరణ్ మూవీ రాలేదు. బాబాయి అబ్బాయి మూవీ ముడిపడలేదు. ఇటీవల కాలంలో అలాంటి వార్తలు ఏమీ వినిపించలేదు. మళ్లీ ఇప్పుడు పవన్ నిర్మాణంలో మూవీ అంటూ ప్రచారాలు మొదలయ్యాయి.
ఈసారి పవన్ నిర్మాణంలో రామ్ చరణ్ కాకుండా వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నాడు అనేది కొత్త పుకారు. రచయిత కోన వెంకట్ తయారు చేసిన ఒక స్క్రిప్ట్ తో పవనే స్వయంగా వరుణ్ హీరోగా ఒక సినిమా నిర్మించబోతున్నాడని టాక్. ఆ సినిమాకు కోన సహ నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారని ప్రచారం జరుగుతుంది. దర్శకుడిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది చర్చలు జరుపుతున్నారట. పవన్ మరియు కోనల మద్య స్నేహం ఉంది. ఆ సంబంధాల కారణంగా అయినా ఈ మూవీ పట్టాలు ఎక్కవచ్చని అనుకుంటున్నారు అంతా. మరి ఈ ప్రచారం అయినా నిజమో కాదో చూడాలి మరి.