

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తలెత్తిన ఇబందులు అధిగమించడానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చెందిన ఐఆర్ఎస్ ఆఫీసర్ల బృందం ఓ నివేదిక తయారుచేసినట్టు ఏప్రిల్ 25,2020న విస్తృతమైన కథనాలు వెలువడ్డాయి. ఇందులో ఆయా రంగాలు,వర్గాలపై పన్నుల బాధ్యతలను ప్రతిపాదించారు. ఈ నివేదిక వెనకాల ఉన్న ముగ్గురు ఐఆర్ఎస్ ఆఫీసర్లపై (CBDT) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్తాజాగా వేటు వేసింది. ప్రస్తుతం వారు కొనసాగుతున్న విధుల నుంచి నోటీసులు జారీ చేసింది. అంతేకాదు, ఆ ముగ్గురిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి FORCE(Fiscal Options & Response to the COVID-19 Epidemic) పేరుతో ఈ ముగ్గురు ఓ నివేదికను రూపొందించారు. మొత్తం 10 రకాల పన్నుల పెంపును ప్రతిపాదించారు. అనుమతి లేకుండానే నివేదికను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేశారు. వారిలో అనవసర భయాందోళనలు నెలకొన్నాయని ప్రభుత్వం గ్రహించింది. దీనికి ఎటువంటి ధ్రువీకరణ లేదని స్పష్టం చేసింది.
క్లారిటీ వచ్చిన మరుసటి రోజే సీబీడీటీ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ ప్రకారం ఈ నివేదిక వెనకాల ముగ్గురు సీనియర్ అధికారులు ఉన్నట్టు తేల్చింది. సంజయ్ బహదూర్,ప్రకాష్ దూబే (డైరెక్టర్ DOPT,ఐఆర్ఎస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ), ప్రకాష్ భూషణ్ (ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఢిల్లీ, ఐఆర్ఎస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ)లకు చార్జీషీట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని, అలాగే వ్యక్తిగత విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం వారు నిర్వర్తిస్తున్న బాధ్యతల నుంచి తప్పించింది.
దూబే, బహదూర్.. ఈ ఇద్దరు సీనియర్ అధికారులు జూనియర్ అధికారుల సహాయంతో ఫోర్స్ నివేదికను తయారుచేసినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాదు,అనధికారికంగా దీన్ని ఐఆర్ఎస్ అసోసియేషన్‌కు కూడా పంపించారు. భూషణ్ అనే మరో సీనియర్ ఐఆర్ఎస్ అధికారి దీన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న ఈ ముగ్గురు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే. ఆ రిపోర్ట్ కేంద్రానికి చేరడం కంటే ముందే బయటకు లీకైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. యువ అధికారులు చేసిన సూచనలను ప్రభుత్వం ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుంది.
ఇలాంటి సందర్భంలో అధికారిక ఛానల్ ద్వారా నివేదికను ప్రభుత్వానికి పంపించడానికి బదులు, ప్రిన్సిపల్ కమిషనర్ హోదాలో ఉన్న ఈ సీనియర్ అధికారులు యువ అధికారులను తప్పుదోవ పట్టించారు. దాన్ని డైరెక్ట్‌గా పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉన్న నేపథ్యంలో ఇలాంటి నివేదికలు ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టిస్తే మరింత ప్రమాదానికి దారితీస్తుందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.