

ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజన్యంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ టీకాను అన్ని దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి ఉందని ఆ సంస్థ సీఈవో అదార్ పూనావాలా వెల్లడించారు. కొవిషీల్డ్ ఎగుమతికి భారత్ అనుమతినివ్వలేదని సోమవారం వార్తలు వచ్చిన నేపథ్యంలో పూనావాలా ట్విటర్ వేదికగా స్పష్టతనిచ్చారు.కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అదార్ పూనావాలా మాట్లాడుతూ.మొదటి 100 మిలియన్ల డోసులను ప్రభుత్వానికి ప్రత్యేక ధరకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారత ప్రభుత్వానికి మాత్రమే అందించగలమని చెప్పారు. మరోవైపు కొవిషీల్డ్ 100 కోట్ల డోసుల కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలతో సీరమ్ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. సీరమ్ ప్రస్తుతం నెలకు 50 నుంచి 60 మిలియన్ల చొప్పున టీకాలను ఉత్పత్తి చేస్తోంది. ఫిబ్రవరి తర్వాత నెలకు 100 మిలియన్ డోసుల వరకు ఉత్పత్తి చేయనున్నట్లు గతంలో తెలిపిన విషయం తెలిసిందే.