

మాయదారి కరోనా ప్రజలను మాములుగా భయపెట్టలేదు. కరోనా కారణంగా యావత్ ప్రపంచం గడగడ లాడింది. ప్రజలందరినీ ఇళ్లల్లో బిక్కు బిక్కు మంటూ గడిపేలా చేసింది. అయితే, దీని వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరికొందరికి కుటుంబంతో గడిపే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని కొంతమంది కుటుంబసభ్యులతో కలిసి బాగా ఎంజాయ్ చేశారు. అయితే, కొంతకాలం ఇంట్లో ఉంటే సరదాగా అనిపిస్తుంది కానీ.. నెలల తరబడి ఇంట్లో ఉంటె ఎవరికైనా విసుగొస్తుంది.
ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇంట్లో ఉండి విసిగిపోయిన సదరు వ్యక్తి తనను అరెస్ట్ చేసి జైలులో వేయమని పోలీసులను బ్రతిమాలుకున్నాడు. ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటె తనకు నరకం కనిపిస్తుందన్నాడు. ఇంట్లో ఉండటం కంటే జైలులో ఉంటేనే మంచిదని అనిపిస్తుందని పోలీసు అధికారులను సదరు వ్యక్తి కోరాడు. ఇంట్లో ఉండలేకపోతున్నానని, కంటిమీద కునుకు కూడా పట్టడం లేదని, ఇంట్లో ఉండటం కంటే జైలు జీవితమే ప్రశాంతం అనిపిస్తుందని పోలీసులను అభ్యర్థించాడు. తనను అరెస్ట్ చేసి జైల్లో వేయమని కోరాడు. దీనికి సంబందించిన వివరాలను బర్గెస్ హిల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. దాంతో అదికాస్తా వైరల్ గా మారింది.