‘స్కిప్పింగ్’ కరోనా కట్టడికి ఓ ఆయుధం…

92
Benefits Of Skipping to overcome coronavirus

చిన్నప్పుడు పిల్లలంతా ఆడ, మగ తేడా లేకుండా ఆడుకునే ‘స్కిప్పింగ్ (తాడు ఆట)’ మళ్లీ ఇప్పుడు కరోనా వైరస్ విజృంభన నేపథ్యంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. స్కిప్పింగ్ తాడును ఎక్కడికైనా, ఎప్పుడైనా తీసుకెళ్లే వీలు ఉండడమే కాకుండా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసే సరాదా ఆట కూడా కావడం దీనికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. అందుబాటు ధరలో లభించే స్కిప్పింగ్ తాడుల వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉండడం కూడా ప్రాచుర్యానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఒకప్పుడు బాక్సింగ్ ట్రేనింగ్లో బాక్సర్ల ఫుట్వర్క్ను మెరగుపర్చేందుకు స్కిప్పింగ్ శిక్షణ ఇచ్చేవాళ్లు. సాధారణ ఆరోగ్యాన్ని మెరగు పరుచుకోవడానికీ ఉపయోగించేవారు. రోజూ పది నిమిషాలు స్కిప్పింగ్ చేసినట్లయితే రక్త పీడనం తగ్గడమే కాకుండా గుండె రక్త ప్రసరణ మెరగు పడుతుంది. వేగంగా గుండె కొట్టుకోవడం తగ్గుతుంది. అంతేకాకుండా శరీరంలోకి ఆక్సీజన్ ఎక్కువగా ప్రసరించి ఇతర అవయవాలతోపాటు గుండె పనితీరు మెరగు పడుతుంది. కోవిడ్ రోగుల శరీరాల్లో ఆక్సిజన్ శాతం పడిపోవడం ప్రాణాంతకం అవుతున్న విషయం తెల్సిందే. స్కిప్పింగ్ వల్ల పేంక్రియాస్లోని బీటా సెల్స్ ద్వారా ఇన్సులిన్ ఉత్పత్తి ఇనుమడిస్తుంది. దాంతో మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గిపోతాయి.

స్కిప్పింగ్ చేయడం వల్ల ఒక్క భుజాలు, చేతుల మణికట్లు, కాళ్ల కండరాలు బలోపేతం కావడమే కాకుండా పొత్తి కడుపు వద్ద కండరాలు కూడా బల పడతాయి. పొట్ట తగ్గుతుంది. స్కిప్పింగ్ వల్ల శరీరంపైనా మంచి పట్టు లభిస్తుందని, దాని వల్ల అరుగులపై నుంచి, మెట్ల పై నుంచి, సైకిళ్లపై నుంచి పిల్లలు పట్టు తప్పి పడిపోవడం ఉండదని కూడా ఓ పరిశోధనలో తేలింది. శరీరంలోని అణువణవు మధ్య మంచి సమన్వయం తీసుకరావడానికి, శరీరంలోని ప్రతి అవయంపై మనకు పట్టు ఉండేందుకు రకరకాల స్కిప్పింగ్ మెలకువలు ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చాయని ఫిట్నెస్ అధ్యాపకులు తెలియజేస్తున్నారు. స్కిప్పింగ్ వల్ల శరీరంలోని ఎముకులు బలపడడమే కాకుండా వాటి మందం కూడా పెరగుతుందని, వృద్ధాప్యంలో ఎముకలు కరగడం మొదలైనప్పుడు ఎముకలు మందం పెరగడం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.

వృద్ధాప్యంలో పడిపోవడం వల్ల తొడ ఎముక విరిగి మంచానికి అంకితమయ్యేవారు లేదా ఎక్కువ మంది మరణించడం మనకు తెల్సిందేనని, స్కిప్పింగ్ వల్ల తొడ ఎముకలు, కండరాలు బలపడతాయని, ఆ కారణంగా కింద పడిపోయినా ఎముకలు విరిగే అవకాశాలు తక్కువవుతాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. శరీర అవయవాలు వేగంగా కదిలేందుకు కూడా స్కిప్పింగ్ తోడ్పడుతుంది. స్కిప్పింగ్ను ‘హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రెయినింగ్ (హెచ్ఐఐటీ)’ కేటగిరీలో చేర్చారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలిచ్చే వ్యాయామాలను ఈ కేటగిరీలో చేరుస్తారనే విషయం తెల్సిందే. అన్నింటికన్నా గొప్ప విషయం స్కిప్పింగ్ చేయడాన్ని ఓ సరదాగా అలవాటు చేసుకోవచ్చు. ఇందులో రక రకాల విద్యలను ప్రదర్శించడం ద్వారా ఇతరులను ఆకర్షించవచ్చు. వారికో సవాల్ విసరునూవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here