

భారతదేశంలో గ్రామాల నుండి నగరాలకు పట్టణాలకు ప్రతీ నిమిషానికి ఇరవై అయిదు నుండి ముప్పై మంది వలస వెళ్తున్నారని ప్రపంచ ఆర్థికవేదిక ఒక అధ్యయనాన్ని వెల్లడించింది. COVID ప్రభావం వలన ఎక్కువగా నగరాలే ప్రభావితమై అయ్యాయని తెలిపింది. దేశ జీడీపీలో 75 శాతం అందుతున్న నగరాలే దేశ అభివృద్ధిలో ఈ ప్రాంతాలే కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని ఈ అధ్యయనం సూచించింది.
కరోనా మహమ్మారి తర్వాత భారతీయ నగరాలు పేరుతో అధ్యయనం విడుదలచేసిన ప్రపంచ ఆర్థిక వేదిక పలు కీలక అంశాలను వెల్లడించింది. ప్రణాళిక, గృహనిర్మాణం, పర్యావరణం, రవాణా, ప్రజారోగ్యం, లింగం, బలహీన వర్గాలు అనే ఏడు అంశాలను పరిణలోకి తీసుకుని దేశీయ అంతర్జాతీయ నిపుణులతో ఈ అధ్యయనాన్ని చేపట్టింది. భారత్ లోని పెద్ద నగరాల్లో ఆర్థిక అసమానతలు అధికంగా ఉన్నాయని.. మురికివాడల విస్తరణ మరియు పట్టణాల్లో జనాభా అధికంగా పెరగడమే దీనికి నిదర్శనమని ఈ అధ్యయనం పేర్కొంది. అంతేగాక గ్రామాలనుండి పట్టణాలకు, నగరాలకు కూడా వలసలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. ఈ వలసలు నిమిషానికి 25-30 వరకు ఉందని ఈ ఆర్థిక నివేదిక పేర్కొంది.
దేశంలోని రెండున్నరకోట్ల కుటుంబాలు, పట్టణ ప్రాంతాలలోని 35 శాతం కుటుంబాలు ఇల్లు కొనుగోలు చేసే పరిస్థితులలో లేవని.. దీనిని అధిగమించేందుకు అందరినీ కలుపుకుంటూపోయేలా పట్టణ నివాసంపై కొత్త నమూనాను తీసుకురావాలని సూచించింది. అందుబాటు ధరలో ఇళ్ళు నిర్మించేందుకు సరఫరా వైపు ఉన్న అడ్డంకుల్ని తొలగించడం సహా.. కార్మికులు నగరాలకు వచ్చి ఉండేందుకు అనువైన గృహాల మార్కెట్ ను ప్రోత్సహించాలని స్పష్టం చేసింది. పట్టణ పునర్నిర్మాణాల యత్నాలలో భాగంగా స్థిరత్వం, వాయు కాలుష్యం, విపత్తు నిర్వాహక చర్యలకు అధిక ప్రోత్సాహం ఇవ్వాలని సూచించింది. ప్రస్తుత భవిష్యత్తు డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను కల్పించాలని పేర్కొంది. పట్టణాలలో అవకాశాలు పొందటంలో మహిళలు, బలహీన వర్గాలను భాగస్వామ్యం చేయాలనీ సూచించింది. చక్కగా రూపొందిన పాలన సజావుగా సాగుతున్న నగరాలు చురుకైన కేంద్రాలుగా ఉంటాయని తెలిపింది. అంతేగాక ప్రైవేట్ ప్రజా జీవితంలో లింగ అసమతౌల్యం పెరిగిందని ఈ అధ్యయనము తెలిపింది. సంక్షోభ సమయాల్లో అత్యవసర సేవలు అందించడానికి ప్రత్యక్షంగా నగరాలకు సహాయం చేయడానికి ఈ డేటా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది.